06/12/2026
Trending News
Homeతాజా వార్తలుమోదీ విమానం ఖరీదు రూ. ఎన్ని వేల కోట్లు తెలుసా?

మోదీ విమానం ఖరీదు రూ. ఎన్ని వేల కోట్లు తెలుసా?

మోదీ విమానం ఖరీదు రూ. ఎన్ని వేల కోట్లు తెలుసా?

భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలకు ఉపయోగిస్తున్న “ఎయిర్ ఇండియా వన్” విమానం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన VVIP విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. బయటకు చూస్తే ఇది సాధారణ బోయింగ్ 777-300ER లాగా కనిపించినా… లోపల మాత్రం ఇది ఒక ఎగిరే కమాండ్ సెంటర్. భారతదేశ అత్యున్నత నాయకత్వం గాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ దేశ భద్రతా వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ, అత్యవసర నిర్ణయ ప్రక్రియ ఎక్కడా ఆగిపోకుండా ఉండేలా ఈ విమానాన్ని రూపొందించారు.

ఈ ప్రత్యేక విమానాలను అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తయారు చేసింది. అమెరికా అధ్యక్షుడి “Air Force One”కు సమానమైన భద్రతా ప్రమాణాలతో వీటిని ప్రత్యేకంగా మోడిఫై చేశారు. ఈ రెండు Boeing 777-300ER విమానాలను భారత ప్రభుత్వం సుమారు ₹8,400 కోట్లకు పైగా వ్యయంతో కొనుగోలు చేసినట్లు అప్పట్లో నివేదికలు వెలువడ్డాయి. ఒక్కో విమానం విలువ దాదాపు ₹4,200 కోట్లకు మించి ఉంటుందని అంచనా. ఈ విమానాలు అమెరికా నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేయబడ్డాయి.

ఎయిర్ ఇండియా వన్‌లో అత్యాధునిక anti-missile defence వ్యవస్థ అమర్చారు. శత్రు దేశాలు లేదా ఉగ్రవాద దాడుల నుంచి విమానాన్ని రక్షించేందుకు Large Aircraft Infrared Counter Measures (LAIRCM), Self-Protection Suites (SPS) వంటి టెక్నాలజీలు ఉన్నాయి. క్షిపణి దాడి జరిగే అవకాశాన్ని ముందుగానే గుర్తించి దారి మళ్లించే సామర్థ్యం దీనికి ఉంది. ఇది సాధారణ కమర్షియల్ విమానం కాదు… ఒక ఎగిరే హైసెక్యూరిటీ కోట.

విమానంలో ప్రత్యేకంగా రూపొందించిన కమాండ్ రూమ్, సెక్యూర్ కమ్యూనికేషన్ సిస్టమ్, శాటిలైట్ ఆధారిత కనెక్టివిటీ, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలు ఉన్నాయి. ప్రధాని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేరుగా ఢిల్లీ అధికార వ్యవస్థతో సంప్రదింపులు జరపగలరు. అత్యవసర పరిస్థితుల్లో గాల్లో నుంచే కీలక నిర్ణయాలు తీసుకునేలా ఈ విమానాన్ని సిద్ధం చేశారు.

అంతేకాదు… ఇందులో ప్రత్యేక వైద్య విభాగం కూడా ఉంది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించే సదుపాయం ఉంటుంది. ప్రత్యేకంగా VVIP విశ్రాంతి గదులు, కాన్ఫరెన్స్ ఏరియా, అత్యంత భద్రత కలిగిన కమ్యూనికేషన్ జోన్, ప్రత్యేక కార్యాలయ గదులు కూడా ఏర్పాటు చేశారు. సాధారణ ప్రయాణికుల విమానంతో పోలిస్తే ఇది పూర్తిగా వేరే స్థాయి టెక్నాలజీతో పనిచేస్తుంది.దీనిని నిర్వహించే బాధ్యత భారత వైమానిక దళం వద్ద ఉంటుంది. భద్రతాపరమైన కారణాలతో విమాన మార్గాలు, ప్రయాణ వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతారు.

అయితే… ఈ అత్యాధునిక లగ్జరీ మరియు హైసెక్యూరిటీ విమానం చుట్టూ రాజకీయ విమర్శలు కూడా తక్కువగా లేవు. ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు “పొదుపు మంత్రం” చెబుతున్నారు. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, చిన్న దూరాలకు అనవసర ప్రయాణాలు చేయవద్దని పిలుపునిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిదని కూడా చెబుతున్నారు.

కానీ మరోవైపు విమర్శకులు మాత్రం “సామాన్య ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పే నాయకులు… తమ జీవనశైలిలో అదే సందేశాన్ని పాటిస్తున్నారా?” అని ప్రశ్నిస్తున్నారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రత్యేక విమానం, అత్యంత ఖరీదైన విదేశీ పర్యటనలు, భారీ భద్రతా వ్యయాలపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. ఒక ప్రముఖ పీఠాధిపతి సైతం “₹8,000 కోట్లకు పైగా ఖర్చు చేసిన విమానం ఎందుకు? సాధారణ విమానంలో ప్రయాణించవచ్చు కదా?” అంటూ ప్రశ్నించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. “పొదుపు అనే సందేశం ప్రజలకేనా? లేక పాలకులకూ వర్తించాలా?” అనే ప్రశ్నను ముందుకు వస్తోంది.

—- ఎడిటోరియల్ డెస్క్

Share With:
Rate This Article
No Comments

Leave A Comment