08/07/2026
Trending News
Homeతాజా వార్తలుమోదీ నాయకత్వం: ప్రపంచ వేదికలపై ప్రశ్నార్థకం!

మోదీ నాయకత్వం: ప్రపంచ వేదికలపై ప్రశ్నార్థకం!

మోదీ నాయకత్వం: ప్రపంచ వేదికలపై ప్రశ్నార్థకం!

ఒక దేశ ప్రధానమంత్రి కేవలం ప్రభుత్వ అధినేత మాత్రమే కాదు. అతడు ఆ దేశ మేధో సామర్థ్యానికి, ఆత్మవిశ్వాసానికి, దౌత్య దిశకు, అంతర్జాతీయ ప్రతిష్ఠకు ప్రతినిధి. ముఖ్యంగా 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశం వంటి దేశానికి నాయకత్వం వహించే వ్యక్తి ప్రపంచ వేదికలపై ఎలా ప్రవర్తిస్తున్నాడన్నది వ్యక్తిగత అంశం కాదు; అది దేశ గౌరవం, జాతీయ ప్రయోజనాలు, భవిష్యత్ వ్యూహాత్మక స్థానం గురించి చెప్పే సూచిక.

నరేంద్ర మోదీ భారతీయ రాజకీయాల్లో అత్యంత విజయవంతమైన ఎన్నికల నాయకుడు. కానీ ఒక విజయవంతమైన ఎన్నికల నాయకుడు తప్పనిసరిగా ఒక సమర్థవంతమైన ప్రపంచ నాయకుడు అవుతాడని అనుకోవట్లేదు. దానికి ఉదాహరణ నరేంద్రమోదీనే. ఎందుకంటే ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు ఒకటి అయితే, ప్రపంచ వేదికపై ఒక దేశ ప్రయోజనాలను ధైర్యంగా, స్వతంత్రంగా, మేధోపరంగా సమర్థించడానికి అవసరమైన నైపుణ్యాలు పూర్తిగా వేరు.

గత దశాబ్దంలో భారత రాజకీయ వ్యవస్థ క్రమంగా వ్యక్తి కేంద్రితంగా మారిపోయింది. ప్రభుత్వం, పార్టీ, ప్రచారం, విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రచారం అన్నీ ఒకే వ్యక్తి ప్రతిఛాయ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్నికల్లో ఈ నమూనా పనిచేసి ఉండొచ్చు. కానీ ప్రపంచ రాజకీయాలు వ్యక్తిగత ప్రజాదరణతో నడిచే వ్యవస్థ కాదు.

ప్రపంచ వేదికపై నాయకత్వానికి నాలుగు కీలక లక్షణాలు అవసరం. మేధో సామర్థ్యం, తక్షణ ప్రతిస్పందన, స్పష్టమైన కమ్యూనికేషన్, స్వతంత్ర దౌత్య దృక్పథం. ఈ నాలుగు అంశాల్లోనే నరేంద్ర మోదీ నాయకత్వం పరిమితులను నేను గమనిస్తున్నాను.ఆందోళన చెందుతున్నాను.

ఒక నాయకుడి అసలు నాయకత్వ సామర్థ్యం ముందే సిద్ధం చేసిన ప్రసంగాల్లో కాదు; ముందస్తు స్క్రిప్ట్ లేకుండా జరిగే చర్చల్లో, ఆకస్మిక ప్రశ్నలకు ఇచ్చే సమాధానాల్లో, ఇతర ప్రపంచ నాయకులతో జరిగే సహజ సంభాషణల్లో బయటపడుతుంది.అలాంటి సందర్భాల్లో నరేంద్ర మోదీ ఎక్కువగా మౌనాన్నే ఎంచుకుంటారు. ఇతర దేశాధినేతలు తమ దేశ ప్రయోజనాలను ధైర్యంగా, స్వతంత్రంగా, నేరుగా సమర్థిస్తున్నప్పుడు భారత ప్రధాని మాత్రం అత్యంత నియంత్రిత ధోరణిలో కనిపిస్తున్నారు.

ప్రపంచ నాయకత్వంలో మౌనం కూడా ఒక రాజకీయ సందేశమే. జాతీయ ప్రయోజనాలు, జాతీయ గౌరవం, భద్రతా అంశాలు చర్చకు వచ్చినప్పుడు నాయకుడు స్పందించకపోవడం బలం కాదు. అది ప్రపంచానికి వేరే సంకేతాలను పంపే ప్రమాదం ఉంది.

గత పదేళ్లలో భారత విదేశాంగ విధానం కూడా అధికంగా వ్యక్తి కేంద్రితంగా మారిపోయింది. విదేశీ పర్యటనలు పెరిగాయి. ప్రపంచ నాయకులతో వ్యక్తిగత సాన్నిహిత్యం పెరిగింది. ఫోటోలు, ఆలింగనాలు, సోషల్ మీడియా ప్రచారం విస్తరించాయి. కానీ ఇవి ఎంతవరకు భారతదేశానికి దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను అందించాయన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం కనిపించడం లేదు.

దౌత్య సంబంధాలు వ్యక్తిగత స్నేహాలపై కాదు, జాతీయ ప్రయోజనాలపై నిర్మించబడాలి. అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత స్నేహితులు ఉండరు; శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. ఒక దేశ విదేశాంగ విధానం కూడా అదే సూత్రంపై నడవాలి.

ఇటీవలి కాలంలో భారతదేశం కొన్ని కీలక భద్రతా, వ్యూహాత్మక అంశాల్లో ఆశించిన స్థాయిలో బహిరంగ అంతర్జాతీయ మద్దతును సమీకరించలేకపోయింది. ఇది విదేశాంగ వ్యూహాన్ని మళ్లీ సమీక్షించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత భద్రతకు సంబంధించిన అంశాలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశం మరొక దేశంపై ఆధారపడుతున్నట్లుగా ప్రపంచానికి భావన కలిగించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, భారత నాయకత్వం నుంచి వెంటనే స్పష్టమైన, దృఢమైన, ఆత్మవిశ్వాసపూర్వక సమాధానం రావాలి. జాతీయ గౌరవం విషయంలో మౌనం ఆమోదయోగ్యంగా కనిపించదు.

భారతదేశం వంటి సంక్లిష్టమైన దేశాన్ని పాలించడానికి ఎన్నికల విజయాలు మాత్రమే సరిపోవు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక రాజకీయాలు, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, భద్రతా సవాళ్లు, వాతావరణ మార్పు వంటి అంశాలను లోతుగా అర్థం చేసుకునే మేధో నాయకత్వం అవసరం.

అత్యంత ప్రమాదకరమైన పరిణామం ఏమిటంటే, నాయకత్వం క్రమంగా వ్యక్తి ఆరాధనగా మారిపోవడం. ఒక దేశం తన నాయకుడిని ప్రశ్నించడం మానేసిన రోజు నుంచి ప్రజాస్వామ్యం బలహీనపడటం ప్రారంభమవుతుంది. విమర్శలను దేశద్రోహంగా చిత్రీకరించడం మొదలైతే, మేధో చర్చలు కుంచించుకుపోతాయి. సంస్థాగత వ్యవస్థలు బలహీనపడతాయి. చివరికి దేశం కంటే నాయకుడే పెద్దవాడిగా కనిపించడం ప్రారంభమవుతుంది.

భారతదేశం ఒక పురాతన నాగరికత మాత్రమే కాదు; ప్రపంచ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదుగుతున్న దేశం. అలాంటి దేశానికి ప్రపంచ వేదికపై ప్రాతినిధ్యం వహించే నాయకత్వం ఎన్నికల విజయాలను దాటి, మేధో సామర్థ్యం, తక్షణ ప్రతిస్పందన, స్పష్టమైన కమ్యూనికేషన్, స్వతంత్ర దౌత్య దృక్పథం, ఆత్మవిశ్వాసంతో కూడిన జాతీయ స్వరాన్ని ప్రతిబింబించాలి.

చరిత్రలో దేశాలను గుర్తుంచేది నాయకుల విదేశీ పర్యటనల సంఖ్య కాదు. ప్రపంచ వేదికపై దేశ గౌరవం ప్రశ్నార్థకమైనప్పుడు వారు ఎంత దృఢంగా నిలబడ్డారన్నదే. 146.కోట్ల ప్రజలకు ప్రతినిధిగా నరేంద్రమోదీపై ఈ దేశం ఎన్నో ఆశలు పెట్టుకుంది. తరచూ తన భాద్యతలను గుర్తు చేస్తోంది. కానీ ఆశించిన ఫలితాలు రావడం లేదు.

— శ్రీనివాస్ గౌడ్ ముద్దం

Share With:
Rate This Article
No Comments

Leave A Comment