09/22/2026
Trending News
Homeతాజా వార్తలుకార్పొరేట్‌ రుణాల వెనుక అసలు కథ!

కార్పొరేట్‌ రుణాల వెనుక అసలు కథ!

కార్పొరేట్‌ రుణాల వెనుక అసలు కథ!

దేశంలో తాజాగా కార్పొరేట్‌ రుణాల రైటాఫ్‌లు, భారీ హెయిర్‌కట్‌లు, సెటిల్‌మెంట్లు మరోసారి చర్చకు వచ్చాయి. సుభాష్‌చంద్రకు సంబంధించిన రుణ సెటిల్‌మెంట్‌ ఈ చర్చకు ఒక సందర్భం మాత్రమే. అసలు ప్రశ్న ఒక్క కంపెనీకి సంబంధించినది కాదు. ప్రజలు బ్యాంకుల్లో దాచుకునే డిపాజిట్లతో ఏర్పడిన నిధుల నుంచి పెద్ద కార్పొరేట్‌ సంస్థలకు వేల కోట్ల రూపాయలు రుణాలుగా వెళ్తున్నాయి. వాటిలో భారీ మొత్తాలు తిరిగి రాకపోతే ఆ నష్టం కేవలం బ్యాంకు ఖాతాల్లోనే మిగిలిపోదు. దాని ప్రభావం చివరికి మొత్తం ఆర్థిక వ్యవస్థపై, పరోక్షంగా ప్రజలపైనే పడుతుంది.

నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్లలో అంటే, 2014-15 నుంచి 2025-26 వరకు పెద్ద పరిశ్రమలు, సేవారంగ సంస్థలకు సంబంధించిన రూ.9.95 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు రైటాఫ్‌ చేశాయి. 2018-19లో ఒక్క ఏడాదిలోనే రూ.1,48,753 కోట్ల రుణాలు రైటాఫ్‌ అయ్యాయి. 2025-26లో ఈ మొత్తం రూ.20,485 కోట్లకు తగ్గింది. రైటాఫ్‌ అంటే రుణమాఫీ కాదని, రుణగ్రహీతపై రికవరీ చర్యలు కొనసాగవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అది సాంకేతికంగా నిజమే. కానీ రైటాఫ్‌ చేసిన మొత్తం అంతా తిరిగి వస్తుందన్నది మాత్రం కాదు. 2021-22 నుంచి 2025-26 మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు రైటాఫ్‌ చేసిన రూ.3.57 లక్షల కోట్లలో రూ.1.65 లక్షల కోట్లే రికవర్‌ అయ్యాయి. మొత్తం పన్నెండేళ్ల కాలంలో రికవరీ శాతం 16 శాతానికి మించలేదని అంటున్నారు. అంటే మిగిలిన మొత్తంపై ఇక ఆశలు వదులుకోవాల్సిందే కదా!

కార్పొరేట్‌ రుణం తీసుకోవడం తప్పు కాదు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కోసం బ్యాంకు రుణాలు అవసరమే. సమస్య రుణం ఇవ్వడంలో కాదు; రుణం ఇవ్వడానికి ముందు కంపెనీ వాస్తవ ఆర్థిక పరిస్థితిని లోతుగా పరిశీలించకపోవడంతో వస్తోంది. రుణం ఇచ్చిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో కచ్చితంగా పర్యవేక్షించాలి. కానీ ఇక్కడ చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు.

కార్పొరేట్‌ రుణ ఫ్రాడ్‌ చాలాసార్లు బ్యాంకు నుంచి డబ్బు తీసుకెళ్లిన క్షణంలో మొదలవదు; మొదట కాగితాలపైనే మొదలవుతుంది. కంపెనీ ఆస్తుల విలువను వాస్తవం కంటే ఎక్కువగా చూపించడం, కొలాట్రల్‌ విలువను మార్కెట్‌ విలువ కంటే పెంచి చూపించడం, భవిష్యత్తు ఆదాయాలను అతిగా అంచనా వేయడం, కంపెనీ క్యాష్‌ఫ్లోలను బలంగా చూపించడం వంటి తప్పుడు మార్గాల్లో ఒక సంస్థను కాగితాలపై ఆర్థికంగా బలంగా కనిపించేలా చేస్తున్నారు. ఆ ఆధారాలతో భారీ రుణం పొందిన తర్వాత, ఉద్దేశ్య పూర్వకంగా ఆ నిధులను సంబంధిత గ్రూప్‌ కంపెనీలకు మళ్లించడం, అసలు ప్రాజెక్టుకు కాకుండా ఇతర అవసరాలకు వినియోగించడం, ఆస్తులను ఇతర సంస్థలకు బదిలీ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

అయితే బాధ్యత రుణగ్రహీతతోనే ముగియదు. వేల కోట్ల రుణం మంజూరు చేసే ముందు వాల్యుయేషన్‌ ఎవరు చేశారు? కొలాట్రల్‌ విలువను ఎవరు నిర్ధారించారు? కంపెనీ క్యాష్‌ఫ్లోలను ఎవరు పరిశీలించారు? గ్రూప్‌ కంపెనీల లావాదేవీలను ఎవరు చూశారు? రుణం ఇచ్చిన తర్వాత నిధుల వినియోగాన్ని ఎవరు పర్యవేక్షించారు? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి. చిన్న వ్యాపారికి లక్షల రూపాయల రుణం ఇవ్వడానికి ఎన్నో పత్రాలు అడిగే బ్యాంకు, వేల కోట్ల రుణం ఇచ్చేటప్పుడు కాగితాల వెనుక ఉన్న వాస్తవాన్ని గుర్తించలేకపోతే, అది కేవలం వ్యాపార వైఫల్యం కాదు; బ్యాంకింగ్‌ వ్యవస్థలోని వైఫల్యం కూడా.

ఆర్‌బీఐ కూడా రుణ ఫ్రాడ్‌ల నియంత్రణలో ఎర్లీ వార్నింగ్‌ సిగ్నల్స్‌, రెడ్‌ ఫ్లాగింగ్‌, డేటా అనలిటిక్స్‌, ఎండ్‌-యూజ్‌ మానిటరింగ్‌, ఇంటర్నల్‌ కంట్రోల్స్‌, స్టాఫ్‌ అకౌంటబిలిటీ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. 2024-25లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో విలువ పరంగా నమోదైన ఫ్రాడ్‌లలో 92.1 శాతం లోన్‌ పోర్ట్‌ఫోలియోకు సంబంధించినవే కావడం కూడా సమస్య తీవ్రతను చూపుతోంది. కాబట్టి రుణం ఎన్‌పీఏ అయిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, మోసం జరగకముందే గుర్తించే వ్యవస్థ అవసరం.

ఒక సామాన్య వ్యక్తి రూ.20 లక్షల గృహ రుణం తీసుకుని ఒకటి రెండు వాయిదాలు ఆలస్యమైనా వడ్డీ, పెనాల్టీ, క్రెడిట్‌ స్కోర్‌, నోటీసులు ఎదురవుతాయి. చివరికి తాకట్టుపెట్టిన ఆస్తి స్వాధీనం కూడా కొన్ని నెలల్లోనే జరిగిపోతుంది. కానీ వేల కోట్ల రుణాలు పొందుతున్న కార్పిరేట్ల విషయంలో రీస్ట్రక్చరింగ్‌, రిజల్యూషన్‌, హెయిర్‌కట్‌, సెటిల్‌మెంట్‌ అంటూ సంవత్సరాల ప్రక్రియ సాగుతుంది. నిజమైన వ్యాపార వైఫల్యానికి చట్టబద్ధమైన పరిష్కారం అవసరమే. కానీ మోసం చేసి రుణం పొందినవారికి కూడా భారీ రాయితీ లభిస్తే, అది వ్యాపార వైఫల్యానికి పరిష్కారం కాదు; వ్యవస్థలోని బలహీనతకు ప్రోత్సాహం అవుతుంది.

సుభాష్‌చంద్రకు సంబంధించిన తాజా సెటిల్‌మెంట్‌ వ్యవహారం కూడా అందుకే ప్రశ్నలు రేకెత్తించింది. లొసుగులను బయటపెట్టింది. ప్రజాగ్రహానికి కారణమైంది. భారీ రుణాలు ఎందుకు ఇచ్చారు, వాటి వెనుక ఉన్న వాల్యుయేషన్లు ఎంత వాస్తవమైనవి, నిధులు ఎక్కడికి వెళ్లాయి, రుణం ఎన్‌పీఏ అయ్యే వరకు ఎవరు పర్యవేక్షించారు, చివరికి బ్యాంకుకు ఎంత తిరిగి వచ్చింది అన్నదే విస్తృతంగా పరిశీలించాల్సిన విషయం.

కార్పొరేట్‌ రుణ ఫ్రాడ్‌ను అరికట్టాలంటే రుణం ఇచ్చే ముందు మాత్రమే కాదు, రుణం ఇచ్చిన తర్వాత కూడా కఠినమైన ఎండ్‌-టు-ఎండ్‌ అకౌంటబిలిటీ ఉండాలి. కొలాట్రల్‌కు స్వతంత్ర వాల్యుయేషన్‌, పెద్ద రుణాలపై నిరంతర ఎండ్‌-యూజ్‌ మానిటరింగ్‌, గ్రూప్‌ కంపెనీల నిధుల ప్రవాహంపై నిఘా, ఎర్లీ వార్నింగ్‌ వ్యవస్థ ఉండాలి. ఫ్రాడ్‌ నిర్ధారణైతే రుణగ్రహీతతో పాటు సంబంధిత వాల్యువర్‌, ఆడిటర్‌, మధ్యవర్తి లేదా బ్యాంకు అధికారిపై కూడా చర్య తప్పనిసరి కావాలి.

ప్రజల డబ్బుతో వేల కోట్ల రుణాలు ఇచ్చినప్పుడు, ఆ డబ్బు ఎందుకు తిరిగి రాలేదు? ఎంత నష్టం జరిగింది? ఆ నష్టానికి అసలు బాధ్యులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బ్యాంకులకూ, రుణగ్రహీతలకూ, సంబంధిత వ్యవస్థకూ ఉంది. ప్రజల సొమ్మును పణంగా పెట్టి నిర్ణయాలు తీసుకునే వారికి జవాబుదారీతనం లేకపోతే, రుణాల రైటాఫ్‌లు, భారీ హెయిర్‌కట్‌లు, సెటిల్‌మెంట్ల పేరుతో కొందరి వ్యాపార వైఫల్యాలను లేదా అక్రమాలను కప్పిపుచ్చి, చివరికి ఆ నష్టాన్ని ప్రజల నెత్తిన వేస్తున్న వ్యవస్థగా ఇది మారుతుంది.

౼ శ్రీనివాస్ గౌడ్ ముద్దం

Share With:
Rate This Article
No Comments

Leave A Comment