06/13/2026
Trending News
Homeతాజా వార్తలుకలలను కంపెనీలుగా మార్చుతున్న కొత్త తరం

కలలను కంపెనీలుగా మార్చుతున్న కొత్త తరం

కలలను కంపెనీలుగా మార్చుతున్న కొత్త తరం

ఒకప్పుడు తరాలు తమ తమ కాలపు భావజాలాలతో గుర్తింపును సంపాదించుకున్నాయి. ఒక తరం భావకవిత్వంలో జీవించింది. ఇంకో తరం విప్లవ సాహిత్యాన్ని శ్వాసించింది. మరొక తరం ప్రభుత్వ ఉద్యోగాల భద్రతలో జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇంకొందరు తమ కలలకూ వాస్తవాలకూ మధ్య లంకె కుదరక, నిరాశతో కాలం గడిపారు. కానీ ఇప్పుడు కనిపిస్తున్న తరం పూర్తిగా భిన్నం. ఇది “ఎంట్రప్రెన్యూర్‌షిప్ జనరేషన్”. ఉద్యోగం కోసం ఎదురు చూసే తరం కాదు. అవకాశాలను సృష్టించే తరం. భవిష్యత్తును ఊహించేది కాదు.. దాన్ని నిర్మించేది.

ఈ తరానికి వ్యాపారం అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం కాదు. అది ఒక జీవన విధానం. వారి ఆలోచనల్లో స్పష్టత ఉంది. వారి కలల్లో కార్యాచరణ ఉంది. గత తరాలు భావోద్వేగాల్లో ఎక్కువగా జీవించగా, ఈ తరం లెక్కల్లో, ప్రణాళికల్లో, అమలులో జీవిస్తోంది. వాళ్ల కలలు మబ్బుల్లో తేలే ఊహలు కావు; ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా నిర్మాణాత్మకంగా ఉంటాయి. ఒక యాప్‌, ఒక ఐడియా, ఒక చిన్న స్టార్టప్‌తో ప్రారంభమై ప్రపంచ స్థాయి వ్యాపారాలుగా ఎదగగలమనే నమ్మకం ఈ తరానికి ఉంది.

ఇది ఇంటర్నెట్‌ పెంచిన తరం. ప్రపంచాన్ని చేతిలోని మొబైల్‌ స్క్రీన్‌లో చూసిన తరం. అమెరికాలో వచ్చిన ఒక బిజినెస్‌ ఐడియా హైదరాబాద్‌లో అమలు చేయొచ్చని, సిలికాన్ వ్యాలీలో పెట్టుబడులు తెచ్చుకోవచ్చని, చిన్న పట్టణం నుంచి గ్లోబల్‌ కంపెనీని నడపొచ్చని విశ్వసిస్తున్న తరం. అందుకే నేటి యువత ఉద్యోగ నియామక ప్రకటనల కంటే స్టార్టప్‌ ఫండింగ్‌ వార్తలపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల కంటే తమ స్వంత సంస్థలకు పేర్లు పెట్టడంలో ఎక్కువ ఉత్సాహం కనబరుస్తోంది.

ఈ మార్పుకు ప్రధాన కారణం ఆర్థిక స్వేచ్ఛపై పెరిగిన అవగాహన. ఒక జీతం జీవితాన్ని కాపాడగలదేమో కానీ సంపదను సృష్టించలేదని ఈ తరం బాగా అర్థం చేసుకుంది. అందుకే రిస్క్‌ తీసుకోవడానికీ, విఫలమవడానికీ భయపడడం తగ్గింది. “ఫెయిల్యూర్” అనే పదాన్ని ఓటమిగా కాకుండా అనుభవంగా చూడడం ఈ తరానికి వచ్చిన గొప్ప పరిణామం. ఒక వ్యాపారం విఫలమైతే ఇంకోది మొదలుపెట్టాలి అన్న పట్టుదల వీరిలో కనిపిస్తోంది.

ఈ తరం సంపదను వారసత్వంగా ఎదురుచూడడం లేదు; స్వయంగా నిర్మించుకోవాలని చూస్తోంది. ముప్పయ్యేళ్ల వయసులోనే కోట్ల వ్యాపారాలను నడుపుతున్నారు. నలభై వచ్చేసరికి మార్కెట్‌ ఎలా పనిచేస్తుందో, పెట్టుబడులు ఎలా కదులుతాయో, బ్రాండ్‌ ఎలా నిర్మించాలో నేర్చుకుని రాటుదేలిపోతున్నారు. టెక్నాలజీ, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, సోషల్‌ మీడియా .. ఇవన్నీ వీరి చేతుల్లో సాధనాలుగా మారిపోయాయి. ఒకప్పుడు భారీ మూలధనం అవసరమైన వ్యాపారాలను ఇప్పుడు ఒక ల్యాప్‌టాప్‌తో ప్రారంభించే పరిస్థితి వచ్చింది.

వీరు వ్యాపారవేత్తలుగానే కాకుండా కథన సృష్టికర్తలుగానూ మారుతున్నారు. తమ ప్రయాణాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. విజయాలను బ్రాండ్‌గా మలుచుకుంటున్నారు. ఒకప్పుడు రచయితలు, కవులు, మేధావులు సమాజంపై ప్రభావం చూపితే, ఇప్పుడు యువ ఎంట్రప్రెన్యూర్లు కూడా అంతే ప్రభావాన్ని చూపుతున్నారు. స్టార్టప్‌ ఫౌండర్లు కొత్త తరానికి సెలబ్రిటీలుగా మారుతున్నారు.

అయితే ఈ మార్పులో ప్రమాదాలు కూడా ఉన్నాయి. వేగంగా విజయాన్ని అందుకోవాలనే ఆతృత కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి దారి తీస్తోంది. “హసల్‌ కల్చర్‌” పేరుతో నిరంతర పోటీ మనుషుల్ని అలసటకు గురిచేస్తోంది. సోషల్‌ మీడియాలో కనిపించే విజయ కథల వెనుక ఉన్న ఒంటరితనం, అపజయాలు, అప్పులు చాలా మందికి కనిపించవు. అందుకే ఈ తరం వేగానికి సమతుల్యత కూడా అవసరం. సంపదతో పాటు స్థిరత్వం, విజయంతో పాటు విలువలు కూడా ముఖ్యం అన్న అవగాహన ఉండాలి.

అయినా కూడా ఈ తరాన్ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే వీరు కేవలం తమ జీవితాలను మార్చడం కాదు; దేశ ఆర్థిక నిర్మాణాన్నే మార్చుతున్నారు. ఉద్యోగాలు అడిగే తరం నుంచి ఉద్యోగాలు ఇచ్చే తరంగా మారుతున్నారు. ఆవిష్కరణలను ఆర్థిక శక్తిగా మలుస్తున్నారు. ఒకప్పుడు “సేఫ్‌ జాబ్‌” విజయానికి నిర్వచనమైతే, ఇప్పుడు “స్కేలబుల్‌ ఐడియా” విజయానికి కొత్త నిర్వచనంగా మారింది.

ప్రతి కాలానికి ఒక ముఖచిత్రం ఉంటుంది. ఒకప్పుడు అది కవిత్వం, తర్వాత విప్లవం, ఇంకో దశలో అది ఉద్యోగ భద్రత. కానీ ఈ కాలపు ముఖచిత్రం — ఎంట్రప్రెన్యూర్‌షిప్‌. ఈ తరం కలలు కంటూ కూర్చోదు; కలలకు కంపెనీ రిజిస్ట్రేషన్‌ చేస్తుంది. అవకాశాల కోసం ఎదురు చూడదు; అవకాశాలనే సృష్టిస్తుంది. వీళ్ళ చేతుల్లో ల్యాప్‌టాప్‌ ఉంటుంది, మెదళ్లలో బిజినెస్‌ మోడల్‌ ఉంటుంది, రక్తంలో రిస్క్‌ తీసుకునే ధైర్యం ఉంటుంది. ఇవాళ స్టార్టప్‌లు మొదలుపెడుతున్న ఈ యువతే రేపటి ఆర్థిక వ్యవస్థను నడిపించబోతున్నారు. ఈ తరం కవితలు రాయకపోవచ్చు, కానీ కోట్ల మందికి ఉపాధి ఇచ్చే సంస్థలను నిర్మిస్తోంది. నినాదాలు ఇవ్వకపోవచ్చు, మార్కెట్లను కదిలిస్తోంది. ఇదొక సాధారణ తరం కాదు — దేశ భవిష్యత్తును తిరిగి డిజైన్‌ చేస్తున్న జనరేషన్‌.

— శ్రీనివాస్ ముద్దం

Share With:
Rate This Article
No Comments

Sorry, the comment form is closed at this time.