03/15/2026
Homeబ్యాంకింగ్“ఇంటి రుణం పొందేదెలా?”

“ఇంటి రుణం పొందేదెలా?”

“ఇంటి రుణం పొందేదెలా?”

సొంతిల్లు కొనుక్కుంటే ఎనభై శాతం వరకూ బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తాయనే నమ్మకంతో చాలా మంది బిల్డర్లకు ముందే అడ్వాన్సులు ఇచ్చేస్తూ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకుంటారు. ఆ తరువాత లోన్ కోసం బ్యాంకుల్లో ప్రయత్నాలు మొదలు పెడతారు. కానీ సమస్య ఇక్కడే వస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరగవు. కొంతమంది హోమ్ లోన్ ధరఖాస్తుల్ని బ్యాంకులు తిరస్కరిస్తాయి. రుణం ఇవ్వలేమని తేల్చి చెబుతాయి. దీంతో ధరకాస్తుదారుడు ఇటు బ్యాంకు రుణం రాక, అటు బిల్డర్ దగ్గర అడ్వాన్స్ డబ్బులు తిరిగి వసూలు చేసుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిపోతాడు.

జీవితంలో పెళ్లి తరువాత అతి ముఖ్యమైంది సొంతిళ్లు. ఒక్కోసారి దానికోసం సరిపడినంత డబ్బులు చేతిలో ఉండవు. ఇదే సమయంలో చాలామంది హోం లోన్ తీసుకోవడానికే ఎక్కువ మెుగ్గచూపుతారు. కానీ హోం లోన్ కు దరఖాస్తు చేశాక కొన్నిసార్లు బ్యాంకులు లోన్ ఇవ్వకపోవచ్చు. మన అప్లికేషన్ ను ఆమోదించకపోవచ్చు. దీనికి దరఖాస్తు చేయడంలోని తప్పులే కాదు మరికొన్ని ఇతర కారణాలూ ఉంటాయి. అవేమిటో చూద్దాం..

హోమ్ లోన్స్ వ్యాపారం చేస్తున్న బ్యాంకులు, ఎన్ బీ ఎఫ్ సీ లు ముఖ్యంగా 3 విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.

మెుదటిది ప్రాపర్టీ క్లియరెన్స్. రెండోది క్రెడిట్ స్కోర్, మూడు.. రీ పేమెంట్ కెపాసిటీ.

ప్రాపర్టీ:
మనం కొంటున్న ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ ఉందా? లేదా ? అనేది మొదటి పాయింట్. పట్టా, నోటరీ, గ్రామ కంఠం.. ఇలాంటి ఆస్తులను కొనుగోలు చేయాలన్నా.. వాటిలో ఇల్లు నిర్మాణం చేయడానికైనా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. స్థానిక మునిసిపల్ కార్యాలయాల నుంచి అనుమతులు లేకుండా కట్టే నిర్మాణాలకు కూడా హోమ్ లోన్స్ ఇవ్వరు. ప్రాపర్టీ రిజస్ట్రేషన్ ఎప్పుడైంది? అంతకు ముందు ఎవరెవరి చేతులు మారింది? ఇలాంటి ఎన్నో అంశాలను, లింక్ డాక్యుమెంట్లను పరిశీలించి… లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకే రుణం ఇవ్వడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. అందుకే హోమ్ లోన్ కు వెళ్లేవారు ..తొందరపడి.. బిల్డర్లకు అడ్వాన్సులు ఇచ్చేయకుండా ముందుగా వారి నుంచి ప్రాపర్టీ పేపర్స్ తీసుకుని బ్యాంకర్లకు చూపించండి. సంబందిత ప్యాపర్టీకి రుణం ఇవ్వడానికి న్యాయపరమైన ఇబ్బందులేమీ లేవని బ్యాంకులు చెబితేనే అడ్వాన్సులు ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డాక్యుమెంట్ చేసుకోడానికి ముందుకు వెళ్ళండి.

రెండోది.. సిబిల్ స్కోర్.

లోన్ కోసం అప్లై చేసే వ్యక్తికి 750 వరకూ సిబిల్ స్కోర్ ఉండేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంకు ప్రతీసారీ బ్యాంకులను హెచ్చరిస్తూ ఉంటుంది. కానీ ప్రధాన బ్యాంకుల్లో కనీస స్కోర్ 650 ఉన్నా ఫైల్ ముందుకు వెళ్తుంది. కానీ బ్యాంకులు ధరఖాస్తుదారు సిబిల్ స్కోర్ ఒక్కదానినే పరిగణనలోకి తీసుకోవు. ఆయన ఇంతకుముందు తీసుకున్న అప్పులు సరైన సమయంలోనే చెల్లించాడా? ఏమైనా ఎగ్గొట్టాడా? అనేదీ చూస్తుంది. సిబిల్ 800 వరకూ ఉన్నా .. అప్పటివరకూ తీసుకున్న అప్పుల క్రెడిట్ రిపోర్ట్ సంతృప్తికరంగా లేకపోతే అప్లికేషన్ ను కూడా తిరస్కరిస్తారు.

రీ పేమెంట్ కెపాసిటీ ..

హోమ్ లోన్ మంజూరు చేసే ఏ బ్యాంకైనా కేవలం ప్రాపర్టీ విలువను దృష్టిలో పెట్టుకుని రుణం ఇవ్వదు. అప్పు ఇస్తున్న బ్యాంకులకు కావలసింది ప్రాపర్టీ కాదు.. తాము ఇస్తున్న రుణం అసలు, వడ్డీ కలిపి తిరిగి రాబట్టుకోవడం. అందుకోసమే.. ధరఖాస్తుదారుకు స్థిరమైన ఆదాయం ఉందా? లేదా? అనేది బ్యాంకులు ప్రధానంగా చూస్తాయి. అంతేకాదు.. వయసు, నివాసం, ఎంత చదువుకున్నారనేది కూడా పరిశీలిస్తాయి. మీ వయసు, సర్వీసు కాలం, ఈఎంఐ.. లోన్స్ తిరిగి చెల్లించే సమయం కూడా లోన్ వస్తుందా లేదా అనేది నిర్ణయిస్తాయి. తక్కువ వయసు ఉండి.. లోన్ చెల్లించేందుకు ఎక్కువ టైమ్ ఉంటే.. తక్కువ ఈఎంఐతో లోన్ తీర్చేందుకు ఛాన్స్ ఉంటుంది. కావున తొందరగా ఆమోదించే అవకాశం ఉంది. అదే మీ వయసు ఎక్కువగా ఉండి.. పదవీ విరమణకు దగ్గరగా ఉంటే లోన్ పూర్తి చేసేందుకు మీకు తక్కువ టైం ఉంటుంది. ఈఎంఐ కూడా పెరుగుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. సాధార‌ణంగా నెల‌ ఆదాయంలో 50 -60 శాతం లోప‌లే ఈఎంఐ ఉండేలా బ్యాంకులు జాగ్రత్త పడతాయి. అంత‌కు మించి ఈఎంఐ చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే మీ లోన్ అప్లికేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది.

రుణం ఎంత పొందొచ్చు..

ప్రాపర్టీ మార్కెట్ విలువలో 85 శాతం వరకూ బ్యాంకులు రుణాలిస్తాయి. ప్రభుత్వ రేట్ కార్డు ధరతో సంబంధం లేదు. భవనం నిర్మించి ఎన్నేళ్లు అవుతుంది, ఇల్లు ఉన్న ప్రదేశం, నిర్మాణ విలువలు, ప్రస్తుతం ఉన్న స్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆస్తి విలువ అంచనా వేస్తారు. ఒకవేళ మీ ఆస్తి విలువ తక్కువగా ఉండి.. మీకు లోన్ అర్హత ఎక్కువ ఉన్నా.. అనుకున్న మొత్తం రుణం రాకపోవచ్చు లేదా దరఖాస్తు తిరస్కరించవచ్చు.

జాగ్రత్తలు..
ఇల్లు, విల్లా లేదా అపార్టుమెంట్ ఫ్లాట్ కొనుగోలు చేసేముందు ..సంబందిత నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని ముందే నిర్దారించుకోండి. ఉదాహరణకు..హైదరాబాద్ లోని నిజాంపేట, బాచుపల్లి.. తదితర ప్రాంతాల్లో సాధారణంగా గ్రౌండ్ మరియు రెండు అంతస్తులకే పర్మిషన్ ఉంటుంది. కానీ అక్కడి పాత బిల్డర్లలో తొంభై శాతం మంది అనుమతులు లేకుండానే, గ్రౌండ్ మరియు ఐదు అంతస్తుల వరకూ నిర్మించారు. అలాంటి నిర్మాణాల్లో ఫ్లాట్స్ కొన్నవారికి ఎప్పటికైనా రిస్కులు తప్పవు. అనుమతులు లేకుండా నిర్మించిన అదనపు మూడు అంతస్తులకు బ్యాంకులు హోమ్ లోన్స్ ఇవ్వవు. కానీ కొన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC’s) రుణాలు ఇస్తాయి. ఇదే ధైర్యంతో ఇక్కడి బిల్డర్లు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేశారు. ఇలాంటివాటిలో వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 6.60 % నుంచి 7%లోపే ఉంటే ..వీటిల్లో మాత్రం 16% నుంచి 22 % వరకూ ఉంటోంది. ప్రాసెసింగ్ ఫీజు కింద అదనంగా 2%, ఇన్సూరెన్స్ పేరుతో మరింత మొత్తం వసూలు చేసుకుంటున్నారు.

ఓపెన్ ప్లాట్స్ అయితే..

ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయాలన్నా బ్యాంకులు రుణం ఇస్తాయి. అయితే ఇలాంటి ఆస్తులపై రుణం తీసుకోవాలంటే ప్రాపర్టీకి తప్పనిసరిగా ఎల్ ఆర్ ఎస్ ఉండాలి. లేకపోతే రుణం రాదు. హైదరాబాద్ వంటి నగరాల్లో బ్యాంకు ఋణంతో వెంచర్లలో ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయాలనుకునేవారు.. రెరాలో రిజిస్టరై..హెచ్ ఎం డీ ఏ అనుమతి ఉన్న ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం.

Share With:
Rate This Article
No Comments

Leave A Comment