“స్విగ్గీ” – Success స్టోరీ!
“ఉన్నతంగా జీవించాలంటే లక్ష్యాలూ ఉన్నతంగానే పెట్టుకోవాలి.
#హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నప్పుడే నందన్ రెడ్డి కి ఒక లక్ష్యం ఉండేది. ఎన్నాళ్లీ ఉద్యోగం. ఏదో ఒకరోజు సొంతంగా ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేసెయ్యాలని. కానీ దాని ఫలితం ఈరోజు వేల కోట్ల రూపాయల కంపెనీ తయారౌతుందని మాత్రం అప్పుడు అస్సలు ఊహించనే లేదు.
నందన్ రెడ్డి ఎవరో కాదు. అసలు సిసలు తెలుగు నేపథ్యం ఉన్న నవతరం యువకుడే. మొదట మిత్రుడు శ్రీహర్ష తో కలిసి బిజినెస్ జర్నీ స్టార్ట్ చేసాడు. ఇద్దరూ కలిసి..”కోరుకున్న వంటకం నిమిషాల్లో మన ఇంటికి డెలివరీ చేసి పెట్టే మొబైల్ యాప్ ” SWIGGY” ని సృష్టించారు. దేశీయ మార్కెట్లో అద్భుతమైన విజయాల్లో ఇదీ ఒకటి.
చదువు అవ్వగానే ఆకర్షణీయమైన ఉద్యోగాలు వచ్చినా వాటిలో ఎక్కడా సంతృప్తి ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి ఆలోచించారు. 2013 లో “బండిల్” అనే ఒక కొరియర్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ చిన్న స్థాయి కంపెనీల నుండి వారి కస్టమర్లకు ప్రోడక్ట్స్ ని సరఫరాలు చేసే వారధిగా ఉండేది. ఇలా ఒక సంవత్సరం పాటు ‘బండిల్’ కొనసాగింది.ఆ తరువాత ఇద్దరికీ తెలిసొచ్చింది. ఈ ఆఫ్ లైన్ బిజినెస్ వల్ల పెద్ద లాభమేమి లేదని! తమ లక్ష్యం నెరవేరాలంటే సరైన ప్లాట్ ఫామ్ ఇది కాదని.
అది 2014.
అప్పుడప్పుడే ఈ- కామర్స్ సంస్థలు ఒక్కొక్కటిగా ఉబికి వస్తున్న రోజులు. అమెజాన్, రెడ్ బస్, ఫ్లిప్- కార్ట్, ఈ-బే లాంటి సంస్థలు ఆన్లైన్ లో సేవలని అందించడం అప్పటికే మొదలు పెట్టి దూసుకుపోతున్నాయి.
వీటిని చూసి స్ఫూర్తి చెందిన హర్షకి ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ సర్వీస్ ను స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. దీనినే నందన్ కి చెప్పాడు. తనకి కూడా ఈ ఆలోచన బాగా నచ్చడంతో ఆగష్టు 14, 2014 న “Swiggy” అనే పేరుతో కార్యాచరన రూపంలో పెట్టారు ఇద్దరు స్నేహితులు కలిసి.
అయితే ఈ ఆన్లైన్ బిజినెస్ కోసం కోడింగ్ అవి చేయడానికి ఒక వ్యక్తి కావాలి.. ఆ వ్యక్తికి కూడా ఇలాంటి అభిరుచే ఉంటే వాళ్ళ సక్సెస్ కి తిరుగు ఉండదు అని గ్రహించిన హర్ష – నందన్ లు.. ఐఐటీ ఖరగ్పూర్ లో పట్టభద్రుడయిన రాహుల్ ని వ్యూహాత్మకంగా తమ వ్యాపార భాగస్వామిగా తీసుకున్నారు.
మొత్తంమీద ముగ్గురు కలిసి రాత్రి, పగలు కూర్చుని ‘ స్విగ్గి’ యాప్ కి ఒక రూపం కల్పించారు. మొదట ఆరుగురు డెలివరీ బాయ్స్ తో పని మొదలు పెట్టేసారు. సమీపంలోని 25 రెస్టారెంట్లతో డీలింగ్ కుదుర్చుకుని 2014 సెప్టెంబర్లో బెంగుళూరులో ‘Swiggy’ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు.
ఎక్కడో బెంగుళూరులో మొదలయ్యిన ‘Swiggy’ ఈ నాలుగు సంవత్సరాలలో మన దేశంలోని ఢిల్లీ, ముంబాయి, పూణే, బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా, విశాఖపట్టణం లతో పాటు ప్రస్తుతం దాదాపు 100 పట్టణాలకు విస్తరించింది.
ప్రస్తుతం Swiggy దేశంలోని 60 వేల రెస్టారెంట్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండున్నర లక్షల మంది డెలివరీ బాయ్స్ కి ఉద్యోగ అవకాశాలిచ్చింది. 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ తో ఫుడ్ డెలివరీ లోనే అగ్రగామిగా నిలిచింది.
దీని మార్కెట్ విలువ 3.30 బిలియన్ డాలర్లుగా లెక్కించారు. ఇటీవలే ఈ కంపెనీలో మరిన్ని వేలకోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చి చేరాయి.
ముగ్గురు అసాధారణమైన లక్ష్యాలు కలిగి ఉన్న అతి సాధారణ యువకులు కలిసి ఒక ఐడియాను క్రియేట్ చేసి, డెవెలప్ చేసిన ఫలితం ..
ప్రస్తుతం ఈ ముగ్గురూ బిలియనీర్లుగా మారిపోయారు. వీరిలో ఇద్దరు 30 ఏళ్లలోపే ఫోర్బ్స్ జాబితాలో చేరిపోయారు. డబ్బుకు డబ్బు ..పేరుకు పేరు రెండూ సొంతమైపోయాయి.
“ఉన్నతంగా జీవించాలంటే లక్ష్యాలూ ఉన్నతంగానే ఉండాలి. ఈ ముగ్గురూ కలగన్నదీ అదే. కలిసి చేసి..సాధించిందీ అదే”

Sorry, the comment form is closed at this time.