03/15/2026
Homeరియల్ ఎస్టేట్స్థిరాస్తి కొంటున్నారా? ఇవీ జాగ్రత్తలు!

స్థిరాస్తి కొంటున్నారా? ఇవీ జాగ్రత్తలు!

స్థిరాస్తి కొంటున్నారా? ఇవీ జాగ్రత్తలు!

ఎంతైనా సొంతిల్లు సొంతిల్లే. సొంత ఇల్లు అనేది ప్ర‌తీ ఒక్కరి కల. ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత కలిగే ఆనందం, గర్వం చాలా అద్భుతమైనది. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తీ జీవితంలో ఏదో ఒక సందర్బంలో సొంత ఇంటికి ఓనర్ కావాలనుకుంటాడు. దానికోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తుంటాడు. అంతటి ముఖ్యమైన ఇంటి కొనుగోలు విషయంలో కొందరు తొందరపాటుతో వ్యవహరించి ఇబ్బందుల పాలౌతుంటారు. అందుకే ముందే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకుంటే ఇరుక్కు పోయామని తర్వాత బాధపడాల్సి వస్తుంది.

ప్రాజెక్టు నిర్మించదలుచుకున్న ప్రాంతంలో భూ యజమాని ఎవరో వారి పేరు మీదే భూ యాజమాన్య పత్రం (టైటిల్‌ డీడ్) ఉంటుంది. బిల్డర్లు ఆ భూమిలో రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలనుకుంటే ఆ యజమానితోనే ఒప్పందం కుదుర్చుకోవాలి. కానీ కొన్నిచోట్ల కొంతమంది చిన్న బిల్డర్లు రిజిస్ట్రేషన్‌ చార్జీల భారం తగ్గించుకునేందుకు టైటిల్‌ డీడ్‌ విషయంలో రాజీ పడుతుంటారు. పొరపాట్లు చేస్తుంటారు. టైటిల్‌ డీడ్‌ సరిగ్గా లేకపోయినా భూ యజమానులతో జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జిపిఎ)/జాయింట్‌ డెవల్‌పమెంట్‌ ఒప్పందం కుదుర్చుకుని అపార్ట్‌మెంట్లు/విల్లాల నిర్మాణం చేస్తున్నారు. కొనుగోలుదారులు ఈ విషయంలో ముందే జాగ్రత్త పడాలి. ఆ ప్రాజెక్టు భూమికి సంబంధించిన టైటిల్‌ డీడ్‌, కనీసం 20 ఏళ్ల లింక్‌ డాక్యుమెంట్లు, డెవల్‌పమెంట్‌ అగ్రిమెంట్‌, పన్ను చెల్లింపు రసీదుల కాపీలు తీసుకోవాలి. అవకాశం ఉంటే జిపిఎ కాపీ కూడా అడిగి తీసుకోవాలి.
నిజానికి ఇక్కడ బిల్డర్లు అన్ని అనుమతులు లభించాకే ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టాలి. కానీ శివారు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు నిర్మించే చాలా మంది బిల్డర్లు ఇప్పటికీ ఆయా పంచాయితీల అనుమతులతోనే నిర్మాణాలు చేస్తున్నారు. ఇది తప్పు. ఈ అనుమతులు చట్టపరంగా చెల్లవు. ఈ నిర్మాణాలకు ఆయా పట్టణ ప్రాంతాల డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డిటిసిపి) అనుమతి తప్పనిసరి. హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల్లో అయితే హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసిల అనుమతి తప్పనిసరి. ఫ్లాట్‌లేదా విల్లా బుక్‌ చేసి డబ్బులు చెల్లించే ముందే ఆయా ప్రాజెక్టులకు ఈ అనుమతులు ఉన్నాయా? లేదా అని చూసుకోవాలి . కేవలం పంచాయితీల అనుమతులు చూసి మాత్రమే కొనొద్దు.

ఇంటి నిర్మాణాలకు సంభందించి ఏ ప్రాజెక్టు అయినా ఆమోదించిన ప్లాన్‌ ప్రకారం ఉండాలి. కానీ కొంత మంది బిల్డర్లు నిర్మాణ ఖర్చులు తగ్గించుకునేందుకు అనుమతించిన ప్లాన్‌ని కాదని అదనపు అంతస్తులు నిర్మించి అమ్మకానికి పెడుతుంటారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో చౌకగా వస్తోందని అనుమతులను అధిగమించి నిర్మించిన ఫ్లాట్‌ లేదా విల్లా కొనుగోలు చేయొద్దు. వీటికి బ్యాంకుల్లో గృహ రుణాలు కూడా రావు. నాన్ బ్యాంకింగ్ సంస్థల్లో హోమ్ లోన్ కి వెళితే వడ్డీ రేట్లు ఎక్కువ ఉండడమే కాకుండా రకరాల చార్జీలు వసూలు చేస్తారు. తర్వాత ఈ అక్రమ నిర్మాణాన్ని చట్టబద్దం చేయుంచుకునేందుకు చాలా తిప్పలు పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలకు పెద్ద ఎత్తున ఫీజులు కట్టాల్సి వస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరక్కపోతే స్థానిక పట్టణాభివృద్ధి సంస్థ ఆ ఫ్లాటు లేదా విల్లాను నిర్దాక్షిన్యంగా కూల్చివేసే ప్రమాదం కూడా ఉంటుంది.

కొన్ని చిన్న నిర్మాణ సంస్థలు నాణ్యత లేని ఇటుకలు, ఇసుక, ఐరన్‌, సిమెంట్‌ ఉపయోగిస్తుంటాయి. ఇలాంటి ప్రాజెక్టుల్లో కొనుగోలు చేసిన ఫ్లాట్లు లేదా విల్లాలు కొనుగోలు చేసిన కొద్ది రోజులకే లీకేజీలు, పగుళ్లు, షార్ట్‌ సర్క్యూట్స్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. నాణ్యత గురించి బిల్డర్‌ చెప్పే మాటలు మాత్రమే నమ్మొద్దు. స్వయంగా ఓసారి ప్రాజెక్టువద్దకు వెళ్లి పరిశీలించుకోవాలి. రెరా చట్టం వర్తించే పెద్ద బిల్డర్ల ప్రాజెక్టుల్లో ఫ్లాటు లేదా విల్లా తీసుకుంటుంటే ఈ ఇబ్బంది ఉండదు. ఈ ప్రాజెక్టుల్లో భవన నిర్మాతే ఐదేళ్ల వరకు నాణ్యతకు హామీ ఇస్తారు. చట్టపరంగా గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో మురుగునీటి పారుదల సౌకర్యం, లైటింగ్‌, కామన్‌ రోడ్లువంటి కామన్‌ సదుపాయాలు కల్పించడం బిల్డర్ల బాధ్యత. కానీ కొంత మంది బిల్డర్లయితే ఇది మా పని కాదని తప్పించుకుంటున్నారు. కొనుగోలు ఒప్పందం చేసుకునే సమయంలోనే ఏ ఏ కామన్‌ సదుపాయాలు ఇస్తున్నారు? ఎప్పటిలోగా పూర్తి చేస్తారు? అనే విషయాన్ని ఒప్పందంలో రాతపూర్వకంగా ఉండేలా చూసుకుంటే మంచిది.

ప్రాజెక్టుల్లో విల్లా లేదా ఫ్లాటు కొనుగోలు కోసం మొదటి వాయిదా చెల్లించిన వెంటనే ఆ నిర్మాణ సంస్థతో లిఖిత పూర్వకంగా అమ్మకం ఒప్పందం కుదుర్చుకోవాలి. కొనుగోలుదారులు చేసే ప్రతి చెల్లింపులకు బిల్డర్‌ పక్కాగా రసీదు ఇవ్వాలి. బిల్డర్లు ఇలాంటి పక్కా ఒప్పందాలకు నిరాకరిస్తే అలాంటి ప్రాజెక్టులకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు ఒకటి రెండు ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేసిన బిల్డర్ల ప్రాజెక్ట్‌ల జోలికి పోకపోవడమే మంచిది. చాలా మంది ఇలాంటి ప్రాజెక్టుల్లోనే చేతులు కాల్చుకుంటారు. కనీసం అయిదారేళ్లు ఈ రంగంలో ఉండి మంచి ఆర్థిక సత్తా ఉన్న బిల్డర్‌నే ఎంచుకోవాలి. ఈ సంస్థలు అప్పటికే నిర్మాణం పూర్తి చేసిన ప్రాజెక్టులను ఓసారి వెళ్లి పరిశీలించాలి. వీలైనంతవరకు రేరా పరిధిలో ఉన్న నిర్మాణ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులవైపు వెళితేనే ఏ ఇబ్బందులూ ఉండవు. లెక్కా పత్రాలన్నీ పక్కాగా ఉంటాయి.

Share With:
Rate This Article
No Comments

Leave A Comment