స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి?
షేర్ మార్కెట్ (లేదా స్టాక్ మార్కెట్) అనునది కంపెనీ వాటా (స్టాక్/షేర్) లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక వాణిజ్య సముదాయము. వీటిలో పబ్లిక్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదయ్యే సెక్యూరిటీలు, అలాగే ప్రైవేట్‌గా మాత్రమే ట్రేడ్ చేయబడే షేర్ల వంటివి ఉండవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చాలా తరచుగా స్టాక్ బ్రోకరేజ్‌లు, ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ మాధ్యమాల ద్వారా జరుగుతాయి. ప్రపంచములో జరుగు వాటా లావాదేవీలు ప్రతియేటా దాదాపుగా 85 ట్రిలియన్ డాలర్లు వుంటాయి. అతిపెద్ద స్టాక్ మార్కెట్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని న్యూయార్క్ నగరం అందలి ఎన్.వై.ఎస్.ఈ (NYSE). ప్రపంచములో ముఖ్యమైన స్టాక్ మార్కెట్లు, లండన్, ఆమ్స్టర్డామ్, పారిస్, ఫ్రాంక్ఫర్ట్, హాంగ్ కాంగ్, సింగపూర్, టోక్యో లయందు ఉన్నాయి.
భారత దేశంలో ముఖ్యమైన స్టాక్ ఎక్ఛేంజీలు రెండు ఉన్నాయి. అవి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE). వీటి సూచీలను సెన్సెక్స్, నిఫ్టీ అని అంటారు. వ్యాపార వేళలు ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 3.30 వరకు, శని, ఆదివారాలు సెలవు దినాలు.
ఆసియా ఖండంలోనే అతిపురాతనమైన స్టాక్ ఎక్స్ఛేంజీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ. దీనిని ముంబాయిలోని దలాల్ స్ట్రీట్ లో 1875లో స్థాపించారు. ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 4800కి పైగా కంపెనీలు లిస్టింగ్ అయ్యాయి. 2007 ఆగస్టు నాటికి ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టింగ్ అయిన కంపెనీల పెట్టుబడి విలువ 1.11 ట్రిలియన్ డాలర్లు. దక్షిణాసియాలో ప్రస్తుతం ఇంత విలువ కల్గియున్న స్టాక్ ఎక్స్ఛేంజీ ఇదొక్కటే. 2007 అక్టోబర్ 29న దీని ఇండెక్స్ 20,000 దాటి రికార్డు సృష్టించింది. 2008, జనవరి 10న 21,000 దాటింది. 2008, జనవరి 21న 1400 పాయింట్లను కోల్పోవడం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ చరిత్రలోనే అత్యంత భారీ పతనం. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ అఫీషియల్ వెబ్సైట్ https://www.bseindia.com
