కార్పొరేట్ల రుణాల రద్దు – వాస్తవాలు!
రెండేళ్లుగా కరోనా వైరస్ తో దేశమంతా డీలాపడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో వరుసపెట్టి కార్పొరేట్ కంపెనీల బకాయిల రద్దు అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఉపాధిలేక, వచ్చే ఆదాయ వనరులు లేక ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పని స్థితిలో ఇంట్లోనే ఉంటూ బక్కచిక్కిపోతున్న సామాన్యుడు రిజర్వ్ బ్యాంకు ప్రతియేటా తీసుకుంటున్న నిర్ణయాలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కార్పిరేట్ రుణాల రద్దు వ్యవహారాలను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. అయితే రుణాల రద్దు అంటే మాఫీ కాదని, కేవలం బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుంచి మాత్రమే సాంకేతికంగా తొలగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచూ చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు విమర్శిస్తున్నారు. అసలు ఎవరి వాదనలో నిజముంది? వాస్తవ స్థితిలో అసలేం జరుగుతోంది? అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
రిజర్వ్ బ్యాంకు గడిచిన పదేళ్లలో మొత్తం 9 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసింది. ఇంత పెద్ద మొత్తం కేవలం 50 మంది కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే సంబంధించినవి కావడం గమనార్హం. గడిచిన ఆరేళ్ళ కాలంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వం దాదాపు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఇలాగే వదిలేసింది. పదేళ్ల యూపీఏ ప్రభుత్వాల హయాంలో ఇదే తరహాలో లక్షన్నర కోట్ల రద్దు జరిగితే, ఎన్నో ఆశలతో.. అంచనాలతో .. కోట్లాది ప్రజల నమ్మకాలతో పీఠమెక్కిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మరింత ‘ముందడుగు’ వేసి సంవత్సరానికి సుమారు లక్షా పదివేల కోట్ల రూపాయల చొప్పున మొండి బకాయిలను రద్దు చేస్తూ పోతోంది. అసలీ మొండి బకాయిలు ఎలా తయారవుతాయనే విషయం గురించి ఇప్పుడు చర్చిద్దాం.
ఎవరైనా వ్యక్తికి లేదా సంస్థకు ఇచ్చిన రుణానికి సంభందించిన రుణ వాయిదాలు వరుసగా మూడు నెలలపాటు తిరిగి రాకపోతే బ్యాంకులు దానిని నిరర్థక ఆస్తిగా (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ) గా పరిగణిస్తాయి. ఇలాంటి కేసుల్లో తొంబై రోజుల తరువాత ..3 సంవత్సరాలు గడిచినా ఆ రుణ వాయిదాలు లేదా అసలు, వడ్డీ … ఆ వ్యక్తి , లేదా సంస్థ నుంచి తిరిగి రాని పక్షంలో వాటిని బ్యాంకులు లాస్ ఎస్సెట్ గా గుర్తిస్తాయి. ఇక ఆ రుణ మొత్తంపై ఆశలు వదులుకుంటాయి. ఇలాంటి సందర్భంలోనే ఆ రుణాలకు సంభందించిన వివరాల్ని బాలెన్స్ షీట్ల నుంచి తొలగిస్తాయి. దీనినే ఇప్పుడు రైటాఫ్ లేదా రిటర్న్ ఆఫ్ అంటున్నారు.
కార్పొరేట్లకు ప్రతియేటా రద్దు చేస్తున్న బకాయిలపై ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వం దీన్ని సమర్థించుకుంటోంది. రద్దు అంటే మాఫీ కాదని స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పట్లో వాదించారు. కానీ ప్రభుత్వ వాదనను ఈ రంగంలోని నిపుణులు మూకుమ్మడిగా తప్పు పడుతున్నారు. బ్యాలెన్స్ షీట్లలో ఉన్నప్పుడే వసూలు కానీ మొత్తాలు … బ్యాలెన్స్ షీట్లలోంచి అధికారికంగా తీసేసి, పబ్లిగ్గా ప్రకటించేసి, పూర్తిగా ఆశలు వదులుకున్నాక ఇంకా ఎలా వసూలవుతాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం ఇప్పటికీ రావట్లేదు.
నిజానికి ..
“ఒక లక్ష్యంతో వ్యాపారం ప్రారంభించి, ఉపాధి అవకాశాలు కల్పించి, ఉత్పత్తి ప్రారంభించి, ప్రభుత్వానికి పన్నులు చెల్లించి .. చివరికి ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోయిన వ్యాపారులకు ఇలాంటి రైటాఫ్ పద్ధతులు అవలంభించడంలో తప్పేమీలేదు. కానీ కాగితాలపైనే వ్యాపారాలు చూపించి, దొంగ బాలెన్స్ షీట్లు రూపకల్పన చేసి, పైరవీలతో వేల కోట్ల రూపాయల ఋణం పొందుతున్న వ్యాపారులతోనే అసలు సమస్య వస్తోంది”
2019 వరకు ఉన్న లెక్కలను పరిశీలిస్తే దేశంలో వివిధ బ్యాంకులు వ్యక్తులకు లేదా సంస్థలకు వివిధ రూపాల్లో దాదాపు 88 లక్షల కోట్ల పైనే రుణాలిచ్చారు. ఈ రుణాల్లో కేవలం 50 మంది కార్పొరేట్ వ్యక్తులు తీసుకున్న మొత్తం సుమారు 26 శాతం అని ఒక అంచనా. అంటే 138 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కేవలం కొంతమంది కార్పొరేట్ వ్యక్తుల బలం ఎంతగా ఉందో గమనించవచ్చు.
గతంలో ఎలా ఉన్నా ..దేశంలో కరోనా లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో దిగువ మధ్యతరగతి జీవుల జీవితాలన్నీ ఆందోళనలో పడ్డాయి. రోజువారీగా తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నవారి సంఖ్యా ఎక్కువే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, జపాన్ సహా ఎన్నో దేశాల్లో పౌరులను ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వాలు ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించాయి. ప్రత్యక్షంగా ఆయా కుటుంబాల నిర్వాహణకు సరిపడే విధంగా నగదు పంపిణీ చేసాయి. ఇంకా చేస్తున్నాయి. చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారులకు అద్దెలు సైతం చెల్లిస్తున్నాయి. కానీ భారత్ లో ఇవేమీ లేవు. 138 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఆర్ధిక ప్యాకేజీ కింద ఆమధ్య కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం ఒక లక్ష 70 వేల కోట్ల రూపాయలు మాత్రమే. మిగతావన్నీ బ్యాంకుల ద్వారా అప్పుల రూపంలో ఇచ్చినవే. మొన్న ప్రకటించిన రెండో ప్యాకేజీలో వ్యాపారులకు బ్యాంకుల ద్వారా రుణాలు తప్ప చెప్పుకోదగినవిధంగా ప్రత్యక్ష సహాయం లేనేలేదు. ఇదీ లెక్కలేసినా రూ. 50 వేల కోట్లకు మించట్లేదు. ఇందులో వాక్సిన్ కోసం వెచ్చిస్తున్న మొత్తాలను కూడా కలిపేసారని అంటున్నారు.
బడా కార్పొరేట్ల రుణాల రద్దును ఆగమేఘాలమీద అమలు చేస్తున్న ప్రభుత్వాలు.. పేద, మధ్యతరగతి జీవుల అభివృద్ధి కోసం తగినవిధంగా స్పందించడం లేదనే విమర్శలున్నాయి. పోయినేడాది మారటోరియం సమయంలో బ్యాంకు ఈ ఎం ఐ లను పూర్తిగా రద్దు చేసి ఉన్నట్టయితే బాగుండేదని కోట్లాదిమంది అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ శక్తులకు ప్రతియేటా లక్ష కోట్లకు పైగా రద్దు చేస్తున్న కేంద్రం కరోనా సంక్షోభంలో మధ్య తరగతిపై తీవ్ర ప్రభావం చూపించినా కనీసం 3 నెలల ఈ ఎం ఐ లను రద్దు చేయడానికి కనికరం చూపలేదని విమర్శలు వచ్చాయి.
రిజర్వ్ బ్యాంకు ప్రతియేటా రద్దు చేస్తున్న జాబితాలో ఉన్న వ్యక్తులను పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆగ్రహం వ్యక్తమౌతోంది.
“బ్యాంకుల నుంచి అక్రమ పద్ధతుల్లో రుణాలు తీసుకుని, వాటిని తెలివిగా ఇతర మార్గాలకు మళ్లించి, నష్టపోయినట్టు పత్రాలు చూపించి .. చివరకు నిధులన్నిటినీ మళ్లించుకుని దేశం విడిచి విదేశాల్లో జల్సాగా చేస్తున్నవారే కొందరైతే.. తెలివిగా ఇక్కడే జల్సాగా జీవుస్తున్న వారు మరికొందరు”
అప్పులు ఎగ్గొట్టినవారు అసలే అన్నీ తెలిసిన ముదుర్లు. బ్యాంకింగ్ ట్రాక్ లో ఉన్నప్పుడే వీరు రుణాలు చెల్లించకుండా మొండికెత్తి కూర్చున్నవారు.. ఆర్బీఐ అధికారికంగా రద్దు చేసినట్టు ప్రకటించాక కూడా వారు పెద్ద మనసుతో, నిజాయితీతో ఆ రుణ మొత్తాలను తిరిగి బ్యాంకులకు చెల్లిస్తారని అనుకోవడానికి అసలు వీలేలేదు. గతంలో ఇలా ఎక్కడో అడపాదడపా తప్ప చెప్పుకోదగ్గ మొత్తాలను తిరిగి చెల్లింపులు జరిపినట్టు కూడా ఎలాంటి రుజువులు లేవు. ప్రభుత్వ వాదన మరీ చిత్రంగా ఉంటోంది.
“కార్పొరేట్ల రుణాల రద్దుకు సంభందించిన విషయాలు బయటకు వెల్లడైతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రద్దువైపే మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. ఎన్నికల సమయంలో వారి నుంచి పెద్ద ఎత్తున నిధులు సమకూరడమే అనే విమర్శలూ ఉన్నాయి. అందుకే దేశంలో ఎన్ పీ ఏ అయ్యే బడా పారిశ్రామిక వేత్తల కేసులు ఎన్ని ఎక్కువ ఉంటే అధికారాల్లో ఉన్న పార్టీలకు అంత ఎక్కువ లాభం అని అంటుంటారు”
-శ్రీనివాస్ గౌడ్ ముద్దం
