“ఎమ్మెల్యేలు … రాబందులు!”
తెలంగాణా రాష్ట్రంలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో సామంత రాజులుగా చెలామణి అవుతున్నారు. రాబందుల్లా తయారయ్యారు. అపరిమితమైన అధికార బలంతో డబ్బు సంపాదనే ధ్యేయంగా వందల కోట్లకు ఎదిగిపోతున్నారు.
అనేక ఉద్యమాల తరువాత రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఆవిర్భవించింది. ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అప్పుడే ప్రకటించారు. ఇకనుంచి తమ పార్టీ ఫక్తు రాజకీయాలు చేయబోతుందని. అధికారం చేపట్టాక ఆయన ప్రకటించిన విధంగానే తన రాజకీయ పాలసీని అమలు చేయడం మొదలుపెట్టారు. తొలిసారి తనపార్టీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వాన్ని నడపడానికి పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో తనకు ఎదురే ఉండకూడదని, అసలు ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇతర రాజకీయ పార్టీల్ని చీల్చడం వారిని తమ పార్టీలో కలిపేసుకోవడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్ పార్టీని నిట్ట నిలువునా ముంచేశాడు. కాంగ్రెస్ తో పాటు టిడిపి, వైసీపీ పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలను తన పార్టీలో కలిపేసుకున్నాడు. ఉద్యమ నేత ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత రాష్ట్రంలో దుర్మార్గమైన రాజకీయాలు కళ్ళముందు కనిపించాయి. రాష్ట్రంలో ఇప్పటికీ తమ పార్టీ తప్ప మరే రాజకీయ పార్టీ ఉండకూడదనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్న ఆయన తమ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో ఎదురనేదే లేకుండా ఉండడం కోసం సూపర్ పవర్స్ ఇచ్చేశారు. నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలదే రాజ్యం. వీరు చెప్పిందే వేదం. అధికార పార్టీ ఎమ్మెల్యేల మాట లేకుండా ఆ నియోజకవర్గాల్లో ఏ ఒక్క అధికారి ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి దాపురించింది. పోలీస్ శాఖ నుంచి మొదలుకొని అన్ని డిపార్ట్మెంటులోనూ ఉద్యోగుల బదిలీ వ్యవహారాల్లో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర చేసేసాడు. దీంతో ఏ ఒక్క అధికారి కూడా ఆపార్టీ ఎమ్మెల్యే మాట కాదని పనిచేయని పరిస్థితి తయారయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి గురించి చర్చించుకుందాం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం నుంచి మొదలుకొని హైదరాబాద్ వరకూ భూ దందాలు చేస్తూ వందల కోట్లకు ఎదిగిపోయారు. సొంత నియోజకవర్గంలో పలు అక్రమాలకు పాల్పడ్డాడని, ప్రభుత్వ ఆస్తుల్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడని ప్రతిపక్ష పార్టీలు రుజువులతో సహా చూపిస్తున్నా ఆయనపై బీఆరెస్ పార్టీ అధిష్టానం కానీ, అధికార వర్గాలు గాని ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి. టీవీ డిబేట్ లలో తరచుగా కనిపించే ఈ ఎమ్మెల్యే హైదరాబాద్ శివారులో .. మాయమాటలు చెప్పి తన వ్యాపార భాగస్వామిని నిండా ముంచేసి దాదాపు 100 కోట్లకు పైగానే ఉన్న అతని భూమిని అక్రమంగా లాక్కున్నాడని బాధితుడు మీడియాకెక్కాడు. వ్యవహారం మీడియా వరకు రాకముందు ఆయన తనకు సన్నిహితంగా ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. అయినా లాభం లేకుండా పోయింది. ఆయనకు న్యాయం జరగలేదు. తన భూమిని కబ్జా చేసిన ఎమ్మెల్యేపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. సదరు ఎమ్మెల్యే పార్టీ పెద్దలకు సన్నితుడు కావడం వల్లే తనకు వాళ్లు న్యాయం చేయలేకపోతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. జనగామ జిల్లాలో ఒక ఎమ్మెల్యే కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని ఆయన కూతురు ప్రజల సమక్షంలో ప్రభుత్వానికి ఇచ్చేసారు. హ తండ్రి అక్రమాలపై ఇప్పుడామె పబ్లిగ్గా పోరాడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మరో అధికార పార్టీ ఎమ్మెల్యేది ఇంకో తరహా వ్యవహారం. ఇక్కడ ఈయనదే రాజ్యం. అధికారులందరూ ఈయన చెప్పుచేతుల్లో వ్యవహరిస్తూ ఉంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గోదావరి నది మీదుగా స్మగ్లర్లు అక్రమంగా కలప తరలిస్తున్న విషయాన్ని స్థానికంగా ఉండే ఒక పత్రికా విలేఖరి సాహసం చేసి ఫోటోలతో సహా రుజువులు చూపిస్తూ తమ పత్రికలో ఒక ఆర్టికల్ రాశాడు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సంబంధిత అధికారులు కలపను అక్రమంగా తరలిస్తున్న స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలి. కలపను నిలువ ఉంచిన ప్రాంతాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. వార్త ప్రచురితమైన రోజు కలప స్మగ్లర్లు స్థానిక ఎమ్మెల్యేను కలిశారు. పత్రికలో వచ్చిన వార్తను చూపించి విలేఖరిపై కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే గారు వెంటనే అక్కడి ఎస్సై కి ఫోన్ చేసి వార్త రాసిన విలేకరిపై ఓ కన్నేసి ఉంచాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఆదేశాలను అందుకున్న ఎస్ఐ ఆ విలేఖరిని పోలీస్ స్టేషన్కు పిలిపించుకుని “ఇకనుంచి నీపై నిఘా ఉంటుంది. నువ్వు ఏమేం చేస్తావో అన్నీ మేము గమనిస్తుంటాం” అని వార్నింగ్ ఇచ్చి పంపించారు. అంటే ఆ ఎమ్మెల్యేకు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కంటే తన అనుచరులను కాపాడుకోవడమే ముఖ్యమైంది. అనుచరులకోసం ఎంతకైనా తెగించడమే తన పని అన్నట్టు నిరూపితమైంది. అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్టు పని చేస్తుండడంతో ఆయన ఇలాంటి వ్యవహారాలు ప్రతిరోజు ఎన్నో సెటిల్ చేస్తూనే ఉంటాడని చెప్తుంటారు. పైకి పెద్దమనిషిలా కనిపించే ఈ ఎమ్మెల్యే ఫక్తు రాజకీయాలు చేస్తుంటాడాని చెప్తుంటారు. ఇదే నియోజకవర్గంలో స్థానిక లోక్సభ సభ్యుడు ఇతర పార్టీ నుంచి ఎన్నికయ్యాడు. పేరుకు ఎంపీ అయినా ఆయన మాట ఎక్కడా చెల్లుబాటు కాదు. కనీసం మండల స్థాయి ఎస్సై కూడా ఆయన కాల్స్ లిఫ్ట్ చేయరు. ఒకవేళ చేసినా పని చేసి పెట్టరు. ఎందుకంటే సదరు ఎంపీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఒకవేళ ఎంపీ గారికి సహకరిస్తే ఎమ్మెల్యే గారికి కోపం వస్తుందని అధికారులు భయపడిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు చట్టబద్ధమైన పనులు కూడా చేయడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన ఒక మండల స్థాయి పార్టీ నాయకుడు ఫోన్లో చెప్పినా పోలీస్ స్టేషన్లో పనైపోతుందని.. కానీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు రిక్వెస్ట్ చేసినా పనులు కావని టాక్ నడుస్తోంది. దీనికి ఎన్నో ఉదాహరణలున్నాయి.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో జర్నలిస్టులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడులు చేశారు. విలేఖరులను గదుల్లో వేసి బంధించారు. బెదిరించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే కాళ్లు చేతులు నరికేస్తామని పబ్లిగ్గా హెచ్చరించారు. ఈ సంఘటనల నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేశాయి. కానీ వీరిని పట్టించుకున్న నాథుడు లేడు. సంబంధిత ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసిన సందర్భాలు లేవు. కొన్ని కేసులను అస్సలు పట్టించుకోనేలేదు. మరికొన్నింటిలో ఉత్తుత్తి సారీలతో సరిపెట్టేశారు.
ఇది ఇంకో అధికార పార్టీ ఎమ్మెల్యే కథ. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంటుందీ నియోజకవర్గం. హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉండే ఈ నియోజకవర్గ కేంద్రాన్ని చూస్తే అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా!? అనే అనుమానం కలుగుతుంది. ఎక్కడా అభివృద్ధి అనేదే కనిపించదు. పట్టణంలో ఎటు చూసినా చెత్తాచెదారం, రోడ్లపై మురుగునీరు, ఇరుకైన సందులు.. దారుణంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని అలా ఉంచితే.. హైదరాబాద్ కు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టు ఇటీవల తాను కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం ఆ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న సబ్ రిజిష్ట్రార్ కార్యాలయానికి వెళ్లడం జరిగింది. సాధారణంగా ప్రభుత్వ ఆఫీసులు ఉదయం పదీ పదిన్నర కల్లా తెరుచుకుంటాయి. కానీ ఇక్కడ రూల్స్ వేరే విధంగా ఉన్నాయి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ 12 గంటలకు తెరుచుకుంది. ఇదేంటని అడిగితే ఇక్కడ అంతే అని వాళ్ళు చాలా క్యాజువల్ గా చెప్పేసారు. అంతటితో ఆగలేదు. ఓసారి ఎమ్మార్వో ఆఫీస్ కి వెళ్లి చూడండి.. వాళ్లు ఒంటిగంటకు వస్తారు.. మేమే గంట ముందు తీస్తున్నాం.. అంటూ సమర్ధించుకున్నారు. ఇదే విషయమై స్థానికులను వాకబు చేస్తే పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఇదేనని కుండబద్దలు కొట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసినందుకు గాను తమకు డబ్బులు ఇవ్వాలని ఆ సీనియర్ విలేకరిని అక్కడి ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో కూపోద్రిక్తుడైన సదరు సీనియర్ జర్నలిస్టు పోలీసులకు ఫోన్ చేశాడు. పరిస్థితి తీవ్రంగా మారింది. ప్రధాన పత్రికలకు చెందిన విలేకరులు అక్కడికి చేరుకున్నారు. “పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంత అవినీతి జరుగుతున్నా మీరెందుకు వార్తలు రాయడం లేదని” ఆ సీనియర్ జర్నలిస్టు, అక్కడున్న తోటి విలేఖరులతో వ్యాఖ్యానిస్తే.. వాళ్ళు చెప్పిన మాటలు విని ఆయనకు మతిపోయినంత పనైంది. తామూ గతంలో అధికారుల అవినీతిపై కథనాలు రాశామని, కానీ తాము ఎవరిపై కథనాలు రాశామో వాళ్లే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తమకు ఎమ్మెల్యేతో కాల్ చేయించి దబాయిస్తున్నారని ఒకరిద్దరు విలేఖరులు వాపోయారు. అధికారుల అవినీతిని బహిర్గతం చేయడంలో విలేకరులు ఇక్కడ వెనక్కు తగ్గడానికి ముఖ్య కారణం.. స్థానిక ఎమ్మెల్యే గతంలో సీనియర్ జర్నలిస్ట్ గా పని చేశాడు. సహజంగానే ఆయనకు హైదరాబాదులో పత్రికా అధినేతలు.. బ్యూరో చీఫ్ లతో మంచి సంబంధాలుంటాయి. ఒకవేళ ఎమ్మెల్యేను కాదని తాము వ్యవహరిస్తే .. ఎమ్మెల్యే తనకున్న పలుకుబడితో తమ ఉద్యోగ భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉందని భయపడిపోతున్నారు. అవినీతి అక్రమార్కులకు.. లంచగొండులకు ఎమ్మెల్యేల అండ ఉండడంతో స్థానిక విలేకరులు వార్తలు రాయడానికి జంకుతున్నారని అర్థమైపోతుంది సీనియర్ జర్నలిస్టు వెల్లడించారు. రాష్ట్రంలో మెజారిటీ నియోజకవర్గాల్లో అధికారులనుంచి అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు నెలనెలా ముడుపులు అండడంవలనే ఈ పరిస్థితి దాపురిస్తోందనేది బహిరంగ రహస్యం అయిపోయింది.
మేడ్చల్ జిల్లాలో స్వయానా ఒక మంత్రి , ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ముడుపులు ఇవ్వకపోతే సంగతి చూస్తా అంటూ బెదిరించారు. ఇదే జిల్లాలో ఒక ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో ఉన్న భూములను యదేచ్చగా కబ్జా చేస్తున్నారు. నియోజకవర్గంలో కబ్జా కాబడ్డ భూముల గురించి ప్రతిపక్ష బిజెపికి చెందిన కొందరు యువ నాయకులు మీడియాలో కథనాలు రాయించినా.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. బాగా చదువుకున్నవాడని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేను చేస్తే.. తన అనుచరులు, తన పార్టీ నాయకులు చేస్తున్న భూదందాలను ఆయన అడ్డుకోకపోవడం వెనక ఉన్న అసలు కారణాలు అంతుపట్టక నియోజకవర్గ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే పెత్తనం. అన్నీ తామే అయి వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు ప్రతి పనికీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎమ్మెల్యేలు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, మంచిర్యాల జిల్లాల్లో ఎమ్మెల్యేలపై వచ్చిన లైంగిక ఆరోపణలు తీవ్రమైనవి. ఈ మూడు జిల్లాల్లో ఎమ్మెల్యేల వేధింపులు తట్టుకోలేక కొందరు ప్రాణం కోల్పోతే మరో మహిళ ఇప్పటికి రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఇంకొకరు ఎదురుతిరిగి ప్రశ్నించింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకానికి లబ్ధిదారుల ఎంపిక స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలే చూస్తున్నారు. తమ రాజకీయ పార్టీని పటిష్టపరచుకునే పనిలో భాగంగా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చారు. ఇదే ఇప్పుడు కొంప ముంచుతోంది. తొమ్మిదేళ్ల క్రితం వరకు ఉమ్మడి రాష్ట్రంలో రూ. 100 కోట్ల ఆస్తి ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా!? అని భూతద్దంలో వెతికే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో రూ.100 కోట్ల ఆస్తిలేని ఎమ్మెల్యే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అని చూసే దుస్థితి దాపించింది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పటిష్టంగా ఉండడం, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరం ఈ రాష్ట్రంలో ఉండడంవల్ల సహజంగానే రియల్ భూమ్ ఉంటుంది. ప్రభుత్వ భూములకు పట్టాలు ఇప్పించడం, పట్టాలిప్పించిన భూములను క్రమబద్దీకరించడం వంటి దందాలతో మరికొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో వెనకేసుకుంటున్నారు. వందల కోట్లకు పడగలెత్తుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన అత్యధిక శాతం ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ప్రతిపక్ష పార్టీలు విఫలం కావడంతోనే ఇంకా అధికార పార్టీ హవా కొనసాగుతూ వస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు కొందరిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నా.. వారిపై అధికారికంగా చర్యలు తీసుకోలేని ముఖ్యమంత్రి తాజాగా మళ్లీ వారికే పార్టీ టికెట్లు కట్టబెట్టడం చర్చనీయాంశం అవుతోంది. అవినీతిని అధికారికంగా ప్రోత్సహించినట్టే అవుతోంది. ఇది తప్పు.. ఇది దుర్మార్గం.
-శ్రీనివాస్ గౌడ్ ముద్దం

Sorry, the comment form is closed at this time.