“ఇంటికి బీమా తీసుకోవాలా? వద్దా??”
ఉన్నంతలో సొంతింటిని కలిగి ఉండడం అనేది చాలామందికి ఒక జీవిత ఆశయం. ఎన్నో సంవత్సరాలపాటు వివిధ మార్గాల్లో సంపాదించింది అంతా సొంత ఇంటిపై పెట్టుబడిగా పెట్టుకుంటారు . అయితే ఆ ఇంటిని సురక్షితంగా కాపాడుకోవడం అనేది చాల ముఖ్యమైన విషయం . కానీ ఇంటి నిర్మాణ సమయంలో లేదా కొనుగోలు సమయంలో బ్యాంకు రుణానికి వెళ్ళినప్పుడు ఆయా బ్యాంకుల ఒత్తిడితో తప్ప ఇంటికి భీమా తీసుకోవడం అనేది ఎక్కడా జరిగినట్టు కనిపించడం లేదు . అసలీ భీమా వలన ఉపయోగాలేమిటో కూడా చాలా మందికి అవగాహనే లేదు
ప్రకృతికి కోపం రావొచ్చు. ఉగ్రవాదులు విరుచుకుపడొచ్చు. అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చు. సహజ విపత్తులు జరిగి ఇంటికి నష్టం సంభవించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి, ఇష్టపడి నిర్మించుకున్న ఇల్లుకు నష్టం జరగవచ్చు. ఒకోసారి ఉన్న ఇంటిని ఖాళీచేసి వేరే ఇంట్లో అద్దెకు ఉండాల్సి రావొచ్చు . ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గృహాభీమా తగిన రక్షణ ఇస్తుంది. వెంటనే నష్ట నివారణ చర్యలను చేపడుతుంది.
ప్రీమియం ఎంత ఉండొచ్చు?
గృహ భీమా తీసుకున్నవారికి ఇంటి విలువను బట్టి అన్ని సాధారణ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రీమియం ఎంత ఉంటుందో దాదాపు అదే స్థాయిలో ప్రీమియం ఉంటుంది.
ఉదాహరణకు ఓ భవనానికి 10 లక్షల రూపాయలు, దానిలోని కంటేంట్స్ కు 5 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 15 లక్షలకు హెచ్ డీ ఎఫ్ సి – ఏర్గో నుంచి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే సంవత్సరానికి సుమారు 3 వేల రూపాయలవరకు ప్రీమియం వసూలు వస్తుంది. ఇంటి వయస్సు, కోరుకున్న భీమా మొత్తం, ఇంట్లోని కంటేంట్స్ కు ఎంత మొత్తం భీమా కావాలనేదానిపై ప్రీమియం ఆదారపడి ఉంటుంది.
భీమా సొమ్ము ఎప్పుడు తిరస్కరిస్తాయి?
బీమా ఉందికదా అనే నిశ్చింతలో ఇంటిని నిరక్ష్యం చేయొద్దు. లేదంటే భీమా పరిహారం సమయంలో ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు కొర్రీలు పెడుతుంటాయి. ఇంటికి, ఇంట్లోని వస్తువుల రక్షణ కోసం పాలసీదారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండి నష్టానికి పాలసీదారు కారకుడైతే భీమా కవరేజి ఇవ్వడంలో ఆయా సంస్థలు చేతులెత్తేసే ప్రమాదం కూడా ఉంటుంది.
యుద్ధం, అను ప్రమాదాలు, వరదలు, కాలుష్యం వలన జరిగే నష్టాలకు కొన్ని భీమా సంస్థలు పరిహారం ఇవ్వవు. మరికొన్ని మాత్రం ఇందులోని కొన్నింటికి పరిహారం ఇస్తున్నాయి. ఇంట్లోని వస్తువులకు వయసు ఆధారంగా క్షీణించడం వలన కూడా పరిహారం అందదు . ఉదాహరణకు ఇంట్లో ఉన్న టీవీ కి కూడా భీమా ఉందనుకుందాం. అది పనిచేసే కాలం పదేళ్లు అనుకుంటే ఆ తరువాత టీవీ నష్టానికి పరిహారం అందదు. వస్తువులు పనిచేసే కాలం తీరి చెడిపోతే భీమా అందదు. లేదా భీమా తీసుకున్న కొంత కాలానికే ఏదైనా వస్తువుకు నష్టం చేకూరితే ఆ వస్తువు వాస్తవ విలువలో కొంత తగ్గించి మిగిలిన మొత్తం కవరేజి కింద ఇస్తాయి.
ఇంట్లోని వస్తువులకు కాకుండా కేవలం ఇంటికి మాత్రమే కూడా భీమా తీసుకోవచ్చు. లేదా ఇంటితో పాటు ఇంట్లోని కంటేంట్స్ కు కూడా కలిపి రెండింటికీ భీమా వర్తించేలా కాంప్రహెన్సివ్ భీమా పాలసీ తీసుకోవచ్చు. అసలు వాస్తవిక విలువపైనే భీమా పాలసీ తీసుకోవడం తెలివైన నిర్ణయం. అందుకే భీమా తీసుకునే ముందు నిపుణుల సహాయం తీసుకుంటే మరీ మంచిది. ఇంట్లోని అన్ని వస్తువులకూ భీమా కవరేజీ ఆశిస్తే పాలసీ డాక్యుమెంట్ ను పూర్తిగా చదవాలి. అనుమానాలు ముందే నివృత్తి చేసుకోవాలి. బంగారు నగలు, ఖరీదైన సెల్ ఫోన్లు తదితర ఎక్కువ విలువ ఉన్న వస్తువులకు అన్ని భీమా కంపెనీలు బేసిక్ పాలసీలో కవరేజీ ఇవ్వడం లేదు. అందుకే పాలసీ డాక్యుమెంట్ ముందే పరిశీలించుకోవాలి.
ఉదాహరణకు రిలయన్స్ హౌజ్ హోల్డర్స్ ప్యాకేజీ పాలసీ లో ఇంటితోపాటు ఇంట్లోని వస్తువులకూ కవరేజి ఇస్తోంది. విలువైన మొబైల్స్, టీవీ లు, కంప్యూటర్లు, ఫర్నీచర్, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కుటుంభ సభ్యుల ప్రాణాలకు వాటిల్లే నష్టం, భూకంపాలు, దొంగతనాలు, అగ్ని ప్రమాదాలు, ఉగ్రవాద చర్యలతో కలిగే నష్టాలకూ ఇందులో పరిహారం అందిస్తోంది.
భీమాతో ధీమా !
గృహ భీమా ద్వారా చాల ప్రయోజనాలున్నాయి. వ్యక్తిగత ఆస్తులు నష్టపోయినప్పుడు, ప్రమాదం వాటిల్లినప్పుడు గృహ భీమా పాలసీ కేవలం ఇంటి రక్షణకే కాకుండా అందులోని ఆస్తులకూ కవరేజి అందిస్తుంది. బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానికి పరికరాలకు, ఫర్నీచర్ కూ, పురాతనమైన వస్తువులకు సైతం తగిన రక్షణ లభిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కొత్త వస్తువులు మార్చుకునేందుకు, లేదా మరమ్మతులు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
భీమా ఎవరు తీసుకోవచ్చు ?
ఈ పాలసీని కేవలం సొంతిల్లు ఉన్నవారు మాత్రమే కాకుండా అద్దె ఇంట్లో ఉన్నవారు సైతం తీసుకునే వీలుంది. ఆ ఇల్లు మీది కాకపోవచ్చు. కానీ అందులోని వస్తువులు మీవే కదా! వస్తువుల కోసం కూడా భీమా కంపెనీలు పాలసీలు అందిస్తున్నాయి. ఇకపోతే కేవలం అద్దె డబ్బుల కోసమే కొందరు ఇండ్లను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటివారు ఇంటి రక్షణపై పెద్దగా ద్రుష్టి పెట్టరు. ఇది పూర్తిగా తప్పు. ఇంటిని అద్దెకు ఇచ్చినా ఇల్లు మాత్రం మనదే కదా! ఏదైనా జరగరానిది జరిగితే నష్టపోవాల్సింది మనమే కదా! అందుకే ఇంటి రక్షణ కోసం భీమా పాలసీ తీ సుకోవడం మంచిదే!
